: అరుణగ్రహంపై అరుదైన రికార్డు
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అరుణగ్రహంపై పరిశోధనకు సంబంధించి మరో అరుదైన రికార్డును సృష్టించింది. నాసా ప్రయోగించిన ఆపర్చ్యునిటీ రోవర్ అంగారకుడిపై 35.760 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ అరుదైన రికార్డును సృష్టించింది. 40 ఏళ్ల చరిత్ర కలిగిన నాసా ఉపయోగించిన రోవర్ల చరిత్రలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణం చేయడం ఇదే తొలిసారికావడం విశేషం.
1972 డిసెంబరులో అపోలో`17 యాత్ర ద్వారా సెర్నాన్, హ్యారీసన్ అనే వ్యోమగాములు చంద్రుడిపై రోవర్ వాహనంలో 35.744 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకూ భూమికి వెలుపల నాసా ప్రయోగించిన రోవర్ ప్రయాణించిన అత్యధిక దూరం ఇదే. అయితే అరుణ గ్రహంపై పరిశోధనకు ఉపయోగించిన ఆపర్చ్యునిటీ రోవర్ 2004లో ఆ గ్రహంపై దిగింది. గత గురువారం నాడు అది 80 మీటర్ల దూరం ప్రయాణించింది. దీంతో అపర్చ్యునిటీ ప్రయాణించిన దూరం 35.744 కిలోమీటర్లుగా రికార్డయింది. దీంతో ఇప్పటి వరకూ అపోలో యాత్రలో పాల్గొన్న రోవర్‌కు ఉన్న రికార్డును ఆపర్చ్యునిటీ బద్దలు కొట్టింది. అయితే ఇది నాసాకు మాత్రమే చెందిన రికార్డు. అంతరిక్షంలో ఇప్పటి వరకూ అత్యధిక దూరం ప్రయాణం చేసిన రికార్డు మాత్రం రష్యా పేరుమీద ఉంది. 1973లో రష్యాకు చెందిన లునోఖోడ్`2 రోవర్ చంద్రుడిపై 37 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రికార్డు సృష్టించింది.