tiger skin: నకిలీ పులిచర్మం అమ్మబోయి అడ్డంగా బుక్కయ్యారు!
- అడ్డదారిలో డబ్బు సంపాదనకు ప్రయత్నం
- ఇంట్లో ఉంటే శుభం అంటూ మాయమాటలు
- టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కడంతో బెడిసి కొట్టిన ప్లాన్
నకిలీ పులిచర్మాన్ని ఏడు లక్షల రూపాయలకు అమ్మాలని ప్లాన్‌వేసి టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడితో అడ్డంగా బుక్కయిపోయారు మోసగాళ్లు. అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి ఓ వ్యక్తి వేసిన ప్లాన్ బెడిసి కొట్టడంతో మొత్తం నలుగురు జైలు పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే... సంతోష్‌నగర్‌లో నివాసం ఉండే సయ్యద్ జిలానీ ఈజీ మనీకోసం వెంపర్లాడుతుండేవాడు. ఇతను శంషాబాద్ విమానాశ్రయంలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఓ సందర్భంలో కారులో ప్రయాణికులు పులి చర్మం గురించి మాట్లాడుకోవడం విన్నాడు.
ఒరిజినల్ పులి చర్మం పూజ గదిలో ఉంచితే అన్నీ శుభాలే జరుగుతాయని, లక్షలు వెచ్చించయినా ఒరిజినల్ చర్మాన్ని కొనొచ్చని అనడంతో జిలానీలో ఆశపుట్టింది. అత్యంత విలువైనది పులిచర్మం అని భావించి ఆ దారిలో డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. విషయాన్ని తమ్ముడు గయాస్‌కు చెప్పాడు. అతను తన స్నేహితుడు అమాన్, పండ్ల వ్యాపారి షేక్ జలీల్‌కు తమ వద్ద పులిచర్మం ఉందని కొనేవారుంటే చెప్పాలని కోరాడు.
వారు సరేననడంతో జుమ్మేరాత్‌బజార్‌కు వెళ్లి ఓ నకిలీ పులిచర్మాన్ని కొని తెచ్చాడు. రూ.7 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. అది నల్లమల అడవుల్లో తిరిగే పులి నుంచి సేకరించిందంటూ నమ్మబలికాడు. వీరి మధ్య బేరసారాలు జరుగుతుండగా ముందుగా అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించి ఈ నలుగురినీ పట్టుకున్నారు. నకిలీ చర్మాలను స్వాధీనం చేసుకున్నారు.