Team India: రెండో వన్డేలో టీమిండియా ఓటమి... చేజారిన సిరీస్

  • ఆక్లాండ్ వన్డేలో 22 పరుగుల తేడాతో కివీస్ విజయం
  • లక్ష్యఛేదనలో 251 పరుగులకు టీమిండియా ఆలౌట్
  • మూడు వన్డేల సిరీస్ 2-0తో న్యూజిలాండ్ కైవసం

న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసి ఎంతో ఉత్సాహంతో వన్డే సిరీస్ కు సిద్ధమైన టీమిండియా చేదు ఫలితాన్ని చవిచూసింది. కివీస్ తో ఆక్లాండ్ లో జరిగిన రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 0-2తో చేజార్చుకుంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది.

టాపార్డర్ వైఫల్యం భారత్ కు ఓటమి తెచ్చిపెట్టింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చివరి ఓవర్ వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. ఓ భారీ షాట్ కు యత్నించి లాంగాఫ్ లో క్యాచ్ ఇవ్వడంతో జడేజా పోరాటం ముగిసింది. దాంతోపాటే టీమిండియా ఇన్నింగ్స్ కు కూడా తెరపడింది.

లక్ష్యఛేదన ఆరంభంలో ఓపెనర్ పృథ్వీ షా 19 బంతుల్లో 6 ఫోర్లతో 24 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (3) తీవ్రంగా నిరాశపరిచాడు. కెప్టెన్ కోహ్లీ (15), రాహుల్ (4), కేదార్ జాదవ్ (9) సైతం స్వల్పస్కోరుకే వెనుదిరగడంతో జట్టును ఆదుకునే బాధ్యత శ్రేయాస్ అయ్యర్ పై పడింది. అయ్యర్ 52 పరుగులతో రాణించినా కీలక సమయంలో అవుట్ కావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఈ దశలో జడేజా లోయరార్డర్ బ్యాట్స్ మెన్ సాయంతో పోరాటం సాగించాడు. శార్దూల్ ఠాకూర్ 18 పరుగులు చేయగా, నవదీప్ సైనీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేశాడు.

అయితే కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో కివీస్ బౌలర్లు సఫలం అయ్యారు. జడేజా చివరి వికెట్ రూపంలో అవుట్ కావడంతో భారత్ కథ పరిసమాప్తం అయింది. ఆతిథ్య జట్టు బౌలర్లలో బెన్నెట్, సౌథీ, జేమీసన్, గ్రాండ్ హోమ్ తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు, టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఇక, ఇరుజట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే ఫిబ్రవరి 11న మౌంట్ మాంగనుయ్ లో జరగనుంది.

Team India
Team New Zealand
Auckland
ODI
Series
  • Loading...

More Telugu News