Team India: మరోసారి చెలరేగిన రాస్ టేలర్... టీమిండియా టార్గెట్ 274!

  • 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసిన న్యూజిలాండ్
  • 73 పరుగులతో నాటౌట్ గా నిలిచిన టేలర్
  • 3 వికెట్లు తీసిన చాహల్

ఆక్లాండ్ లో ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు సాధించింది. తద్వారా టీమిండియా ముందు 274 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్లు గుప్టిల్, నికోల్స్ లు కివీస్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న ఈ జోడీని స్పిన్నర్ చాహల్ విడదీశాడు. చాహల్ విసిరిన అద్భుతమైన బంతికి నికోల్స్ (41) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన బ్లండెల్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆ తర్వాత జట్టు స్కోరు 157 పరుగుల వద్ద గుప్టిల్ (79 పరుగులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రనౌట్ కావడంతో న్యూజిలాండ్ స్కోరు నెమ్మదించింది. ఒకానొక సమయంలో 197 పరుగులకే న్యూజిలాండ్ 8 వికెట్లను కోల్పోయింది. అయితే తొలి వన్డే హీరో రాస్ టేలర్, జేమీసన్ లు చెలరేగడంతో చివరి 6 ఓవర్లలో స్కోరు బోర్డు మళ్లీ దూసుకుపోయింది. 74 బంతులను ఎదుర్కొన్న టేలర్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇతర బ్యాట్స్ మెన్లలో లాథమ్ 7 పరుగులు, నీశమ్ 3, గ్రాండ్ హోమ్ 5, చాప్మన్ 1, సౌథీ 3 పరుగులు చేశారు. జేమీసన్ 24 బంతుల్లో 25 పరుగులు (1 ఫోర్, 2 సిక్సర్లు) చేసి నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో చాహల్ 3, శార్దూల్ ఠాకూర్ 2, జడేజా ఒక్క వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News