Botsa Satyanarayana Satyanarayana: ఈరోజుకీ చంద్రబాబు మైండ్ సెట్ మారలేదు: మంత్రి బొత్స
- ఏపీ ఒక్క అంగుళం కూడా అభివృద్ధి చెందకూడదని చూస్తున్నారు
- ఎవరూ పెట్టుబడులు పెట్టకూడదని భావిస్తున్నారు
- చంద్రబాబువి దుర్మార్గమైన ఆలోచనలు
ఈరోజుకీ చంద్రబాబునాయుడు మైండ్ సెట్ మారలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనంతపురంలోని కియా పరిశ్రమ యూనిట్లు పక్క రాష్ట్రానికి తరలిపోయాయంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పర్మినెంట్ సెటప్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ సంస్థ అయినా తరలి వెళ్లిపోతుందా? అని ప్రశ్నించారు.
కియా పరిశ్రమ యూనిట్లు తరలిపోయాయంటూ ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది? తప్పుకాదా? నువ్వు బాధ్యత గల వ్యక్తివి అయితే అలా ప్రచారం చేస్తావా? ఈ రాష్ట్రం, ప్రజల గురించి ఆలోచించావా? అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంతసేపూ, రాజకీయ లబ్ధి పొందాలని, తనకు వత్తాసు పలికే మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదజల్లాలన్న ఆలోచనే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు బాబుకు పట్టడంలేదని దుమ్మెత్తిపోశారు.
ఏపీ ఒక్క అంగుళం కూడా అభివృద్ధి చెందకూడదని, రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టకూడదని, ఉద్యోగావకాశాలు ఉండకూడదన్న దుర్మార్గమైన ఆలోచనలతో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రానికి ఎవరైనా శత్రువు, అభివృద్ధి నిరోధకుడు ఉన్నాడంటే ‘అది చంద్రబాబునాయుడు గారు, తెలుగుదేశం పార్టీయే’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, అబద్ధాలు ప్రచారం చేసినప్పటికీ ధర్మమే జయిస్తుందని, నిజాయతీ నిలబడుతుందని అన్నారు.