P.Chidambaram: ప్రజా వ్యతిరేక చట్టాలు వస్తే.. ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతారు: చిదంబరం
- మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై చిదంబరం ఆక్షేపణ
- శాంతియుతంగా నిరసనలు తెలిపిన నేతల చరిత్రను మోదీ మరిచారు
- జమ్మూ కశ్మీర్ నేతల నిర్బంధం సబబు కాదు
శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని.. స్వాతంత్య్ర పోరాటం సమయంలో మహాత్మాగాంధీ చేసిన సత్యాగ్రహ దీక్షను, అదేవిధంగా పౌరుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్, జాతి, వర్ణ వివక్షపై శాంతియుతంగా పోరాడిన నెల్సన్ మండేలా వంటి నేతల చరిత్రను మోదీ మరిచినట్లున్నారని ట్వీట్ చేశారు.
అన్యాయమైన చట్టాలను అమోదించడం లేదా అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే.. ప్రజలకున్న మార్గం శాంతియుతంగా నిరసనలు తెలపడమే అని చిదంబరం వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్ర మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తదితర నేతలపై ఎలాంటి నేరారోపణ మోపకుండానే ఆరునెలలు నిర్బంధంలో ఉంచడం అసంబద్ధమని పేర్కొన్నారు. తాజాగా వారిపై ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద కేసులు నమోదు చేయడాన్ని చిదంబరం విమర్శించారు.