Peter Mukhargiya: షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియాకు బెయిల్ మంజూరు!
- 2015లో సంచలనం రేపిన హత్య కేసు
- అప్పటి నుంచి జైల్లో ఉన్న పీటర్, ఇంద్రాణి
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు
ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె షీనా బోరా హత్య కేసులో, ఆమె మారు తండ్రి పీటర్ ముఖర్జియాకు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన న్యాయమూర్తి నితిన్ సంబ్రే, హత్య కేసులో పీటర్ కు ప్రమేయం ఉందని సీబీఐ ఎటువంటి ఆధారాలనూ కోర్టు ముందు ప్రవేశపెట్టలేదని అభిప్రాయపడింది.
పీటర్ తన పాస్ పోర్టును సీబీఐకి అప్పగించడంతోపాటు, రూ. 2 లక్షల పూచీకత్తును సమర్పించాలని, కేసులో సాక్షులైన తన కుమారుడు రాహుల్, కుమార్తె నిధిలతో మాట్లాడరాదని షరతులు విధించింది. ఇక ఇదే సమయంలో బెయిల్ పై సీబీఐ అపీలు చేసుకునేందుకు ఆరు వారాల స్టే విధిస్తున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, 2015లో దేశవ్యాప్తంగా షీనా బోరా హత్య కేసు సంచలనం రేపగా, పీటర్ ముఖర్జియా అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు. ఇదే కేసులో షీనా తల్లి ఇంద్రాణి కూడా అప్పటి నుంచే జైల్లో ఉన్నారు.