Narendra Modi: హెచ్చరించినందుకు ధన్యవాదాలు.. రేపటి నుంచి సూర్యనమస్కారాలు మరింత ఎక్కువగా చేస్తా: మోదీ
- ఆరు నెలల్లో మోదీని దేశ యువత కర్రలతో కొడతారంటూ నిన్న వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత
- సూర్యనమస్కారాలతో శరీరాన్ని మరింత బలంగా చేసుకుంటానన్న మోదీ
- రైతు సంక్షేమం విషయంలో రాజకీయాలు వద్దని విపక్షాలకు హితవు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, విపక్ష నేతలపై సెటైర్లు వేస్తూ నవ్వులు పూయించారు. ఉద్యోగాల కల్పనలో మోదీ విఫలమయ్యారని, దేశ యువత మరో ఆరు నెలల్లో మోదీని కర్రలతో కొడతారని నిన్న ఒక కాంగ్రెస్ నేత అన్నట్టు విన్నానని... ముందుగానే ఈ హెచ్చరికలు జారీ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ఈ నేపథ్యంలో సూర్య నమస్కారాలు మరింత ఎక్కువగా చేయాలని తాను నిర్ణయించుకున్నానని, దీంతో తన వెనుక భాగం మరింత బలంగా తయారవుతుందని, ఎన్ని కర్ర దెబ్బలనైనా తట్టుకుంటుందని చెబుతూ సభలో మోదీ నవ్వులు పూయించారు. గత 20 ఏళ్లలో తాను ఇలాంటివి ఎన్నో చూశానని అన్నారు.
భౌగోళికంగా దూరంగా ఉన్న నేపథ్యంలో దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదని... ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఈశాన్య భారతం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. మంత్రులు, అధికారులు క్రమం తప్పకుండా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, అక్కడ ఎన్నో పనులు జరుగుతున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ పథకాన్ని రాజకీయ కారణాలతో కొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదని మోదీ మండిపడ్డారు. రైతు సంక్షేమం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయవద్దని కోరుతున్నానని అన్నారు. రైతుల ఉన్నతి కోసం మనందరం కలసికట్టుగా పని చేయాల్సి ఉందని చెప్పారు.