Ross Taykor: రాస్ టేలర్ అద్భుత సెంచరీ... కివీస్ పర్యటనలో టీమిండియాకు తొలి ఓటమి

  • తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
  • మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన కివీస్
  • భారత్ వరుస విజయాలకు బ్రేక్

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా విజయాలకు బ్రేక్ పడింది. టి20 సిరీస్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి ఆతిథ్యజట్టుకు షాకిచ్చిన భారత్, వన్డే సిరీస్ ను ఓటమితో ప్రారంభించింది. హామిల్టన్ లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది. 348 పరుగుల భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.

సీనియర్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ 109 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వయసు పైబడుతున్నా వన్నె తగ్గని టేలర్ 84 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో టీమిండియా బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతనికి తాత్కాలిక సారథి టామ్ లాథమ్ (69) నుంచి అద్భుతమైన సహకారం అందడంతో విజయం నల్లేరుపై నడకే అయింది. అంతకుముందు, ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (32), హెన్రీ నికోల్స్ (78) పటిష్టమైన పునాదివేయడం కివీస్ కు కలిసొచ్చింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ సాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ 88 పరుగులు, కోహ్లీ 51 పరుగులతో రాణించారు. ఆఖర్లో జాదవ్ చకచకా 26 పరుగులు చేసి స్కోరుపెంచడంలో సాయపడ్డాడు.

ఈ మ్యాచ్ విజయంతో కివీస్ మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 8న ఆక్లాండ్ లో జరగనుంది.

Ross Taykor
Team New Zealand
Team India
ODI
Hamilton
  • Loading...

More Telugu News