Under-19 Worldcup: భారత సీనియర్లు కూడా ఇలా ఆడరేమో... ఒక్క వికెట్ పడకుండా పాకిస్థాన్ ను ఉతికారేశారు!

  • అండర్-19 వరల్డ్ కప్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
  • సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో పాక్ పై ఘనవిజయం
  • సెంచరీతో రాణించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. పోచెఫ్ స్ట్రూమ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా జూనియర్లు విశ్వరూపం ప్రదర్శించారు. మొదట పాకిస్థాన్ ను 172 పరుగులకు కట్టడి చేసి ఆపై ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విధ్వంసం సృష్టించారు. కేవలం 35.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 176 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించారు.

సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ 8 ఫోర్లు,4 సిక్స్ లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలవగా, మరో ఓపర్ దివ్వాంశ్ సక్సేనా 59 పరుగులతో అద్భుతంగా తోడ్పాటునందించాడు. ఈ జోడీని విడదీసేందుకు పాక్ కెప్టెన్ ఆరుగురు బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. ఓ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై భారత సీనియర్ జట్టు కూడా ఇంత సాధికారంగా ఆడలేదనిపించేలా కుర్రాళ్లు కుమ్మేశారు. ఈ విజయంతో భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది.

కాగా, ఎల్లుండి న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో భారత కుర్రాళ్లు టైటిల్ పోరులో తలపడనున్నారు. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 9 ఆదివారం జరగనుంది. నేడు సెమీస్ ఆడిన పోచెఫ్ స్ట్రూమ్ లోనే ఫైనల్ కూడా జరగనుండడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News