RGIA: బాంబనుకుని చూస్తే... బంగారం... శంషాబాద్ లో కిలోన్నర వదిలెళ్లిన వ్యక్తి!
- కన్వేయర్ బెల్ట్ పై ఎవరూ తీసుకోని బ్యాగ్
- బంగారం ప్లేట్లకు ఇనుప పూత
- గుర్తు తెలియని వ్యక్తి కోసం గాలింపు
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్వేయర్ బెల్ట్ పై ఎవరూ తీసుకోకుండా మిగిలిపోయిన ఓ బ్యాగ్ లో బాంబుందన్న అనుమానంతో తనిఖీలు చేయగా, కిలోన్నర బంగారం బయటపడింది. వివరాల్లోకి వెళితే, ఇంటర్నేషనల్ అరైవల్ బ్లాక్ లో ఓ బ్యాగ్ కన్వేయర్ బెల్ట్ పై తిరుగుతూ ఉండిపోయింది. దీనిని ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాలేదని గుర్తించిన భద్రతా సిబ్బంది సీఐఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. దీంతో బ్యాగులో బాంబు ఉండవచ్చన్న అనుమానంతో హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ ను పిలిపించారు.
బ్యాగును పరిశీలించి చూడగా, అందులో బాంబు లేదని, అయితే, ఓ అనుమానిత వస్తువు ఉందని గుర్తించారు. ఆపై దాన్ని స్కాన్ చేసి చూశారు. ఓ ఎలక్ట్రిక్ మోటారు అందులో ఉంది. బంగారం ప్లేట్లకు ఇనుప పూత పూసి మోటారులో అమర్చారని, దాదాపు కిలోన్నర బంగారాన్ని ఎవరో తీసుకుని వచ్చుంటారని తేల్చారు. తనిఖీలకు భయపడిన సదరు వ్యక్తి, బ్యాగును తీసుకోకుండానే వెళ్లిపోయి ఉంటారని భావించి, అతను ఎవరన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు.