Maharashtra: సేమ్ టు సేమ్!.. హత్య చేసి పోలీసులకు ‘దృశ్యం’ సినిమా చూపించాడు!

  • వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు హత్య
  • మృతదేహం, ద్విచక్ర వాహనాన్ని పాతిపెట్టిన నిందితుడు
  • కేసును ఛేదించిన క్రైం బ్రాంచ్ పోలీసులు

తన భార్యతో సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తిని చంపేసిన హంతకుడు పోలీసులకు ‘దృశ్యం’ సినిమా చూపించాడు. అయితే, ఆ సినిమాలో హంతకుడు తెలివిగా తప్పించుకున్నప్పటికీ ఈ ఘటనలో మాత్రం తప్పించుకోలేకపోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కాప్సీ ప్రాంతంలోని ఓ కంపెనీలో గిరంకర్ (32) ఎలక్ట్రీషియన్. అదే ప్రాంతంలో ఫుడ్‌స్టాల్ నడుపుతున్న అమర్‌సింగ్ అలియాస్ జోగేందర్‌సింగ్ ఠాకూర్ (24) గిరంకర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

విషయం తెలిసిన గిరంకర్ వార్దా జిల్లాకు మకాం మార్చాడు. గతేడాది డిసెంబరు 28న బైక్‌పై అమర్‌సింగ్ ఫుడ్‌స్టాల్ వద్దకు వచ్చిన గిరంకర్.. వివాహేతర సంబంధం విషయమై ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో కోపం పట్టలేక గిరంకర్ తలపై ఠాకూర్ సుత్తితో బలంగా మోదాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గిరంకర్ మృతితో ఏం చేయాలో పాలుపోని ఠాకూర్ అచ్చం ‘దృశ్యం’ సినిమాలోలా ఆలోచించాడు. తన స్టాల్‌లో పనిచేసే వంటమనిషి, స్నేహితుడి సాయంతో స్టాల్ వెనక పది అడుగుల లోతులో గొయ్యి తవ్వించాడు. డ్రమ్ములో గిరంకర్ మృతదేహాన్ని ఉంచి దానిని 50 కిలోల ఉప్పుతో నింపేసి, ఆ పక్కనే అతడి బైక్‌ను ఉంచి పాతిపెట్టేశాడు. గిరంకర్ మొబైల్ ఫోన్‌ను రాజస్థాన్ వైపు వెళ్లే లారీలోకి విసిరేసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.

గిరంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు ఛేదన కోసం క్రైం బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. గిరంకర్ పలుమార్లు ఫుడ్‌స్టాల్‌కు వెళ్లినట్టు గుర్తించి మఫ్టీలో వెళ్లి కీలక ఆధారాలు సేకరించారు. పూర్తి ఆధారాలు చేతికి అందిన వెంటనే నిందితులు ఠాకూర్, వంటమనిషి మనోజ్ (37), ఠాకూర్ స్నేహితుడు తుషార్ రాకేశ్ (28)లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గిరంకర్ మృతదేహాన్ని, అతడి బైక్‌ను బయటకు తీయించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News