Chandrababu: ఏ బ్రాండు తాగాలో చెప్పడానికి నువ్వెవరివయ్యా?: చంద్రబాబు
- మద్యం పాలసీ ద్వారా ఎంతో నష్టం వాటిల్లింది
- 'జే ట్యాక్స్' వేశారని అప్పుడే చెప్పాం
- కమిషన్లు ఇవ్వని వాళ్ల బ్రాండ్ లేకుండా చేశారన్న బాబు
ఏపీ విపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ ఎనిమిది నెలల్లో మద్యం పాలసీ ద్వారా ఎంతో నష్టం వచ్చిందని అన్నారు. ఆదాయం పెరగడం కాదు సరికదా, ఇంకా తగ్గిపోయిందని తెలిపారు. మద్యం విధానంలో కమిషన్ల కోసం 'జే ట్యాక్స్' వేశారని తాము అప్పుడే చెప్పామని చంద్రబాబు వెల్లడించారు.
"ఎంపిక చేసిన బ్రాండ్లనే అమ్మకానికి పెడతారా? హూ ఆర్ యూ? వినియోగదారుడు ఏం తాగాలో చెప్పడానికి నువ్వెవరివయ్యా! నీ కమిషన్ కోసం నువ్వు చెప్పిన బ్రాండే తాగాలా? ఎవరైనా కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ల బ్రాండ్ ను రాష్ట్రంలో లేకుండా చేశారు. శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీ ముడుపులు ఇవ్వలేమని ఉత్పత్తి నిలిపివేసింది. తెలంగాణ, కర్ణాటకలో మద్యం రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి. కమిషన్లకు కక్కుర్తిపడి ఇష్టానుసారం చేస్తావా? ఎవడిచ్చాడు నీకీ అధికారం? ఎక్కడా అవినీతి లేకుండా చేయాల్సిన నువ్వు, కమిషన్ల కోసం దరిద్రంగా తయారుచేస్తావా?" అంటూ సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.