Jagan: స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న జగన్.. అమ్మవారికి పూజలు
- విశాఖ శారదా పీఠానికి చేరుకున్న జగన్
- రాజశ్యామల అమ్మవారి పూజలో సీఎం
- సాయంత్రం విశాఖ నుంచి తిరుగుపయనం
విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదా పీఠానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారి పూజలో పాల్గొంటున్నారు. అనంతరం గోమాతకు నైవేద్యం సమర్పించి జమ్మిచెట్టుకి ప్రదక్షిణ చేస్తారు.
ఆ తర్వాత యాగశాలలో గత ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీనివాసం చతుర్వేద హవనం, విశ్వశాంతి హోమాలను సందర్శిస్తారు. అనంతర మహాపూర్ణాహుతిలో పాల్గొంటారు. ఆ తర్వాత పీఠంలో కొత్తగా నిర్మించిన స్వయంజ్యోతి మంటపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి జగన్ చేతుల మీదుగా స్వర్ణకంకణ ధారణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత విశాఖ నుంచి జగన్ తిరుగు పయనమవుతారు.