China: చైనాపై పంజా విసిరిన మరో వైరస్... 4500 కోళ్లు మృత్యువాత!
- ఇప్పటికే చైనాలో కరోనా వైరస్ బీభత్సం
- తాజాగా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు
- ఓ కోళ్ల ఫార్మ్ లో హెచ్5ఎన్1 వైరస్ గుర్తింపు
కరోనా వైరస్ తో అతలాకుతలమవుతున్న చైనాకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. తాజాగా బర్డ్ ఫ్లూకి కారణమయ్యే ప్రమాదకర హెచ్5ఎన్1 వైరస్ కూడా చైనాలో బయటపడింది. కరోనా వైరస్ కు జన్మస్థానంగా ఉన్న హుబేయ్ ప్రావిన్స్ కు పక్కనే ఉన్న హునాన్ ప్రావిన్స్ లోని ఓ పౌల్ట్రీ ఫార్మ్ లో ఈ వైరస్ ను గుర్తించారు. ఇప్పటికే ఈ కోళ్ల ఫార్మ్ లో 4500 కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ హెచ్5ఎన్1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో చైనా యంత్రాంగం వెంటనే స్పందించింది. కోళ్ల ఫార్మ్ లో ఆరోగ్యంగా ఉన్న కోళ్లను వ్యాధిగ్రస్త కోళ్ల నుంచి వేరుచేసింది. ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.