Union Budget 2020: నగరాల్లో 'స్వచ్ఛ గాలి' పెంపుకు.. ‘క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్’!
- ఈ ప్రాజెక్ట్ అమలుకు రూ.4,400 కోట్లు
- దేశ వ్యాప్తంగా పట్టణాల్లో కాలుష్యం పెరిగింది
- కాలుష్య నియంత్రణకు విధానాలు రూపొందిస్తాం
నగరాల్లో పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా ప్రజలు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతున్న విషయాన్ని కేంద్రం గుర్తించింది. పెద్దనగరాలు సహా దేశ వ్యాప్తంగా పట్టణాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో గ్యాస్ ఛాంబర్ లా అయిందని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ లో నిర్మల ‘క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్’ ప్రకటించారు.
ఈ పథకం అమలు కోసం రూ.4,400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, స్వచ్ఛమైన గాలికోసం ఈ పథకాన్ని తెస్తున్నట్లు చెప్పారు. ఈ పథకంలో భాగంగా చెట్లు నాటడం, కాలుష్య నియంత్రణకు కొత్త విధానాలు రూపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. నగరాల్లో ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేకపోవడం దురదృష్టకరమంటూ నిర్మల వ్యాఖ్యానించారు.