CAT: 'క్యాట్' ఆగ్రహంతో ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్ కు అప్పటికప్పుడు బకాయిలు చెల్లించిన ఏపీ ప్రభుత్వం

  • ఇటీవలే ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ ను సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
  • క్యాట్ ను ఆశ్రయించిన కృష్ణ కిశోర్
  • వేతనాలు చెల్లించకపోతే సీఎస్ ను పిలవాల్సి ఉంటుందన్న క్యాట్
  • వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం

గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే కృష్ణ కిశోర్ క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) ను ఆశ్రయించడంతో సస్పెన్షన్ పై స్టే విధించారు. తాజాగా, ఈ వ్యవహారంలో విచారణ కొనసాగించిన క్యాట్ ఏపీ సర్కారుపై మండిపడింది. కృష్ణ కిశోర్ వేతన బకాయిలు ఇంకా ఎందుకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యదర్శిని పిలిపించమంటారా? అంటూ సూటిగా అడిగింది. ఆపై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

దాంతో ఏపీ సర్కారు వెంటనే ఆ ఐఆర్ఎస్ అధికారి వేతన బకాయిలను చెల్లించింది. ఆపై మధ్యాహ్నం విచారణలో భాగంగా క్యాట్ కు ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇదే విషయం విన్నవించుకోగా, ఇప్పటివరకు వేతన బకాయిలు చెల్లించకపోవడానికి కారణాలేంటని క్యాట్ నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్ ను ఆదేశించింది.

అయితే తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో ఈ విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేస్తున్నట్టు క్యాట్ పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడంపై కృష్ణ కిశోర్ కొన్నివారాల కింద క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైదరాబాదులో క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, క్యాట్ సభ్యుడు సుధాకర్ లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.

  • Loading...

More Telugu News