BJP: భైంసా అల్లర్లను ‘చిన్న లొల్లి’గా సీఎం కేసీఆర్ అభివర్ణిస్తారా?: బీజేపీ ఎంపీ సంజయ్ ఆగ్రహం
- దాదాపు 40 ఇళ్లపై దాడులు చేశారు
- మహిళలు సకినాలు చేస్తుంటే మూత్ర విసర్జన చేశారు
- ‘ఎంఐఎం గూండాలు’ అంటూ మండిపడ్డ సంజయ్
భైంసాలో ఇటీవల జరిగిన అల్లర్లను ‘చిన్న లొల్లి’గా సీఎం కేసీఆర్ అభివర్ణిస్తున్నారని, పేదల ప్రాణాలు పోతే కనీసం ఈ ముఖ్యమంత్రి స్పందించడం లేదంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, భైంసాలో పద్దెనిమిది ఇళ్లను దగ్ధం చేసి, ‘దాదాపు నలభై ఇళ్లపై ఎంఐఎం గూండాలు దాడులు చేస్తే’ అది ముఖ్యమంత్రికి ‘చిన్నలొల్లి’ గా కనబడుతోందని ఎద్దేవా చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలు సకినాలు చేసుకుంటుంటే ఎంఐఎం గూండాలు అక్కడికి వెళ్లి మూత్ర విసర్జన చేశారని ఆరోపిస్తూ నిప్పులు చెరిగారు. పేద హిందువుల ఇళ్లల్లో దాడులు చేశారని, బాధితులకు నష్టపరిహారం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించలేదని ధ్వజమెత్తారు.
హిందూ సమాజాన్ని ఆదుకోలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానిది
2008లో నాలుగు ముస్లిం ఇళ్లపై రాళ్ల దాడి జరిగిన ఘటనపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సహా కమ్యూనిస్టులు కూడా వెళ్లి బాధితులను పరామర్శించి, నష్టపరిహారం కూడా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మరి, పద్దెనిమిది ఇళ్లను దగ్ధం చేసిన ఘటనను ‘గల్లీ లొల్లి’గా చిత్రీకరించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
హిందూ సమాజాన్ని ఆదుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం తమకు లేదని, ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో తాము కలిసికట్టుగా ముందుకు వెళతామని, ప్రతి హిందువు స్పందిస్తాడని, ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.