SBI: మూడో త్రైమాసిక ఫలితాల్లో ఎస్బీఐ లాభాల జోరు
- ఏకీకృత నికర లాభాల్లో 41శాతం వృద్ధి
- ఒక త్రైమాసికంలో బ్యాంక్ చరిత్రలో ఇదే తొలిసారి
- తగ్గిన నిరర్థక ఆస్తులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలతో రాణించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా పేరుపొందిన ఎస్బీఐ గత ఏడాది డిసెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసికంలో తన ఏకీకృత నికర లాభాల్లో 41 శాతం వృద్ధిని నమోదు చేయడంతో అవి రూ.6,797.25 కోట్లకు చేరాయి.
కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో ఎస్బీఐ నమోదు చేసిన ఏకీకృత నికర లాభాలు రూ.4,823.29 కోట్లు. ఒక త్రైమాసికంలో నికరలాభంలో ఇంత ఎక్కువ వృద్ధి నమోదవడం బ్యాంక్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికరలాభం రూ.5,583.36 కోట్లుగా ఉంది.
బ్యాంక్ ఏకీకృత ఆదాయం కూడా మూడో త్రైమాసికంలో పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో ఇది రూ.84,390.14 కోట్లుండగా, తాజాగా ఇది 95,384.28 కోట్లకు పెరిగింది. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ ఆదాయం రూ.76,797.91 కోట్లుగా ఉంది. ఎన్పీఏల విషయానికి వస్తే.. ఈ రెండు త్రైమాసికాలను పోల్చితే తాజాగా తగ్గాయి. స్థూల ఎన్పీఏలు 8.71 శాతం నుంచి 6.94 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 3.95 శాతం నుంచి 2.65 శాతానికి తగ్గాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ లో బ్యాంక్ షేర్లు రెండు శాతంపైగా లాభాలతో ముందుకు సాగుతున్నాయి.