Maharashtra: మహారాష్ట్రలో పాత స్నేహం కోసం ఆసక్తి చూపిస్తున్న బీజేపీ
- శివసేనతో విభేదాలతో అధికారానికి దూరమైన బీజేపీ
- కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన
- కాంగ్రెస్ మద్దతు 21వ శతాబ్దపు వింతగా పేర్కొన్న బీజేపీ నేత మునగంటివార్
రాజకీయాల్లో విభేదాలు సమసిపోవడం పెద్ద విషయమేమీ కాదు! పరిస్థితుల ప్రభావం అని చెప్పి విడిపోవడాలు, మళ్లీ కలవడాలు సర్వ సాధారణం. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అలాంటి దృశ్యమే ఆవిష్కృతం కానుంది. పాత స్నేహాన్ని కోరుకుంటూ బీజేపీ... శివసేన దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ఎన్నికల్లో శివసేనకు దూరమై అధికార పీఠాన్ని చేజార్చుకున్న బీజేపీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు సుధీర్ మునగంటివార్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
శివసేన ఇప్పటికీ తమ మిత్రపక్షమేనని, ఇద్దరి భావజాలం, సిద్ధాంతాల్లో పెద్దగా తేడా ఏమీ లేదని మునగంటివార్ అన్నారు. ఉద్ధవ్ థాకరే కోరుకుంటే శివసేనతో కలిసి ప్రభుత్వంలో ఉండేందుకు బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ కోరుకుంటే మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తుండగా, మునగంటివార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శివసేనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడం అనేది 21వ శతాబ్దపు వింత అని ఆయన పేర్కొన్నారు.