PLFI: తీవ్రవాద సంస్థల పేరుతో డబ్బు వసూలు.. పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నేత ఇద్దరు భార్యల అరెస్టు
- కోల్ కతాలోని వీరి ఇళ్లలో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు
- రాంచీలో కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆధారాలు
- భారీ మొత్తంలో నగదు, ఆస్తులు స్వాధీనం
తీవ్రవాదులకు ఆర్థిక సాయం చేసే లక్ష్యంతో కాంట్రాక్టర్లు, ఇతర వర్గాల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై పీపుల్స్ లిబరేషన్ ఫంట్ ఆఫ్ ఇండియా నేత దినేష్ గోపి భార్యలు హీరాదేవి, శకుంతలాకుమారిలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. తీవ్రవాదులకు నిధులు అందడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హీరాదేవి, శకుంతలకు కోల్ కతాలో ఉన్న ఇళ్లలో తనిఖీలు జరిపిన ఎన్ఐఏ అధికారులకు వీరు ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో తీవ్రవాదుల కోసం నిధులు వసూలు చేశారన్న ఆధారాలు లభించాయి. కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.25.38 లక్షలు స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వీరి వద్ద నుంచి మరో 42.79 లక్షల నగదు, రూ.70 లక్షల విలువైన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు.