CoronaVirus: వాణిజ్యానికీ సోకిన కరోనా వైరస్.. వణుకుతున్న కంపెనీలు!
- భారత్‌లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారంపై దెబ్బ
- చైనా విడిభాగాలపై ఆధారపడుతున్న భారత కంపెనీలు
- పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తున్న అనిశ్చితి
శరవేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ ప్రజలనే కాదు, వాణిజ్య రంగాన్నీ భయపెడుతోంది. ఈ వైరస్ దెబ్బకు పలు కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ఈ చైనా వైరస్ కారణంగా మనదేశంలో లక్షల కోట్ల రూపాయల వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లోని మొబైల్, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కంపెనీల్లో చాలా వరకు చైనాపై ఆధారపడుతుంటాయి. అంటే దాదాపు 85-90 శాతం విడిభాగాలు అక్కడి నుంచే దిగుమతి అవుతుంటాయి.
కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు వీటి దిగుమతిలో అవాంతరాలు ఎదురయ్యే పరిస్థితి ఉందని, ఫలితంగా కంపెనీల వ్యాపారంపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, దిగుమతి పడిపోతే ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని, ఫలితంగా వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ముఖ్యంగా మొబైల్ మేకర్లు అయిన షియోమీ, వివో, ఒప్పో, వన్‌ప్లస్, టీసీఎల్, లెనోవో, యాపిల్, రియల్‌మీ వంటి కంపెనీల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలైన ఫాక్స్‌కాన్, స్కైవర్త్ కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. చైనా విడిభాగాలతో ఇవి ఫోన్లు, టీవీలు తయారుచేస్తుంటాయి. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉత్పత్తిపై దెబ్బ పడవచ్చని సమాచారం.