China: చైనా నుంచి భారతీయులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు
- చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి
- వుహాన్, హ్యుబేయ్ ప్రావిన్స్ లో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులు
- వారిని తరలించేందుకు చైనా అనుమతి కోరిన భారత్
- సానుకూలంగా స్పందించిన చైనా
కరోనా వైరస్ ధాటికి బెంబేలెత్తిపోతున్న చైనా దేశం నుంచి విదేశీయులను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వైరస్ జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్ నగరం నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. చైనాలోని వుహాన్ తో పాటు హుబేయ్ ప్రావిన్స్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
చైనాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి విధించిన నేపథ్యంలో వీరిని స్వదేశం తరలించేందుకు రెండు విమాన సర్వీసులు నడుపుతామని, అందుకు అనుమతించాలని భారత విదేశాంగ శాఖ చైనా ప్రభుత్వాన్ని కోరింది. భారత్ విజ్ఞాపనకు చైనా సానుకూలంగా స్పందించడంతో రేపు సాయంత్రం వుహాన్ నుంచి ఓ విమానం, హ్యుబేయ్ ప్రావిన్స్ నుంచి మరో విమానం ద్వారా భారతీయులను తరలించనున్నారు. ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం ఎయిరిండియా బోయింగ్ 747 విమానాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.