Buddha Venkanna: 'నేను విన్నాను, నేను ఉన్నాను' అంటే గుర్తుకొచ్చేది జగన్ కాదు..!: విజయసాయికి బుద్ధా కౌంటర్
- ప్రజలకు చేసిన మోసం గుర్తుకొస్తుందంటూ వ్యాఖ్యలు
- గ్రామాల్లో తిరిగితే బడితె పూజ చేస్తారని వెల్లడి
- విజయసాయికి దీటుగా బదులిచ్చిన బుద్ధా
'నేను విన్నాను, నేను ఉన్నాను' అనగానే సీఎం జగనే గుర్తుకువస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బదులిచ్చారు. 'నేను విన్నాను, నేను ఉన్నాను' అంటే గుర్తుకు వచ్చేది సీఎం జగన్ కాదు విజయసాయిరెడ్డి గారూ, అధికార దాహంతో ఆయన అడ్డగోలుగా ఇచ్చిన హామీలు, అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజల్ని మోసం చేసిన తీరే గుర్తుకువస్తుంది అంటూ ఘాటుగా విమర్శించారు.
"ఒక్కసారి గ్రామాల్లో తిరగమనండి... మేము ఉన్నాము, బడితెపూజ చేస్తాము అంటూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్ ను గ్రామాల్లోకి పంపితే ఎవరి ఇమేజ్ ఏంటో అప్పుడర్థమవుతుంది" అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, సాక్షి మీడియాను ప్రస్తావిస్తూ సీఎం జగన్, విజయసాయిరెడ్డిలపై బుద్ధా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "మీరు, జగన్ పత్రికా విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది విజయసాయిరెడ్డి గారూ! తెలుగువారి మనస్సాక్షి సాక్షి పేపర్ అంటూ జగన్ గారు ఘోరమైన స్టేట్ మెంట్లు ఇచ్చినప్పుడు మీ బుద్ధి ఏమైంది? నిత్యం మీ బ్రోకర్ పనులకు మడుగులు ఒత్తే చెత్త పేపర్ ను, చానల్ ను తెలుగువారి మనస్సాక్షి అంటూ బిల్డప్ ఇచ్చినప్పుడు ధార్మికతను ఆపాదించినట్టు అనిపించలేదా?" అంటూ ప్రశ్నించారు.