Virat Kohli: అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు చూసి మా పనైపోయిందనుకున్నాం: విరాట్ కోహ్లీ

  • కివీస్ సారథి విలియమ్సన్ పై కోహ్లీ ప్రశంసలు
  • 48 బంతుల్లో 95 పరుగులు చేసిన విలియమ్సన్
  • 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊచకోత

హామిల్టన్ లో ఇవాళ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో 20 మ్యాచ్ రోమాంఛకంగా సాగింది. ఇరుజట్ల స్కోర్లు టై కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ లోకి ప్రవేశించింది. కానీ అక్కడ ఆతిథ్య జట్టుకు రోహిత్ శర్మ అడ్డంకొట్టాడు. సూపర్ ఓవర్ చివరి రెండు బంతులను భారీ సిక్సులుగా మలిచి టీమిండియాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.

అంతకుముందు, 179 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీమిండియాను హడలెత్తించాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 95 పరుగులు చేశాడు. విలియమ్సన్ ఊచకోతపై మ్యాచ్ అనంతరం భారత సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ మ్యాచ్ లో విలియమ్సన్ విధ్వంసం చూసిన తర్వాత ఓటమి ఖాయమని భావించామని తెలిపాడు.

"ఓ దశలో మా చేతిలో ఏమీ లేదనిపించింది.... కేన్ ఆ విధంగా కొట్టాడు. కానీ అతడి పరిస్థితికి బాధపడుతున్నాను. ఓటమి ఎవరికైనా బాధాకరమే. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేనప్పుడు ఆ తరహాలో ఆడడం మామూలు విషయం కాదు"  అంటూ ప్రశంసించాడు. ఈ సందర్భంగా భారత్ విజయంలో హీరో పాత్ర పోషించిన రోహిత్ శర్మపై కోహ్లీ పొగడ్తల జల్లు కురిపించాడు.

అటు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు, ఆ తర్వాత సూపర్ ఓవర్ లోనూ రోహిత్ అద్వితీయమైన ఆటతీరు ప్రదర్శించాడని కితాబిచ్చాడు. సూపర్ ఓవర్ చివరి రెండు బంతుల్లో రోహిత్ ఆటతీరు అద్భుతమని కొనియాడాడు. టి20 సిరీస్ ను 5-0తో గెలిచేందుకు కృషి చేస్తామని, అయితే కొందరు రిజర్వ్ ఆటగాళ్లకు మిగిలిన రెండు మ్యాచ్ ల్లో అవకాశాలు ఇస్తామని కోహ్లీ వెల్లడించాడు.

Virat Kohli
Kane Williamson
T20
Super Over
Hamilton
Team New Zealand
Team India
  • Loading...

More Telugu News