GNRao: ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు మా సిఫారసుల్లో లేవు: జీఎన్ రావు
- ప్రాంతీయ అసమానతల తొలగింపు, నిరోధకాలను దృష్టిలో పెట్టుకుని సిఫారసులు చేశాం
- విశాఖ, మచిలీపట్నం విజయవాడలో అభివృద్ధి నిరోధకాలను చర్చించాం
- తీరానికి దూరంగా రాజధాని వుండాలని పెర్కొన్నాం
ఆంధ్రప్రదేశ్ లో సమగ్రాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావు నేడు మీడియాతో మాట్లాడారు. మా సిఫారసుల్లో కీలకమైనది రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణను కొనసాగిస్తూ.. దాంతోపాటు ప్రభుత్వ వికేంద్రీకరణ మోడల్ ఉండాలని సూచించామన్నారు. 13 జిల్లాల్లో (జోన్ 1,2,3,4) ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి ప్రక్రియలో ఎదురయ్యే నిరోధకాలను దృష్టిలో పెట్టుకుని తాము సిఫారసులు చేశామని జీఎన్ రావు తెలిపారు.
విశాఖ, మచిలీపట్నం, విజయవాడలో అభివృద్ధి, ఆటంకాలను కమిటీలో చర్చించామన్నారు. తమ కమిటీ పేర్కొన్నట్లు ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన వార్తలపై రావు స్పందిస్తూ, అవి తమ సిఫారసుల్లో లేవని పేర్కొన్నారు. చుట్టుపక్కల జిల్లాల అభివృద్ధి, వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చేయాలని తాము సూచించామని చెప్పారు.
విశాఖ మెట్రోపాలిటన్ ఉత్తర ప్రాంతంలో సెక్రటేరియట్ నిర్మించాలని పేర్కొన్నామని అన్నారు. విశాఖలో వాతావరణం బాగుండదని సూచించారట కదా? అన్న మీడియా ప్రశ్నకు రావు సమాధానమిస్తూ.. విశాఖ సముద్ర తీరానికి దూరంగా రాజధాని వుండాలని, సుమారు ఏభై కిలోమీటర్ల దూరంలో పరిపాలనా భవనాలను నిర్మించాలని సూచించామని అన్నారు. తుపాన్లు ఎక్కడైనా రావచ్చని వ్యాఖ్యానించారు.