Caribbean: కరీబియన్ దీవుల్లో భారీ భూకంపం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం పరుగులు!
- జమైకా, క్యూబా, కేమన్ దీవుల మధ్య భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.7గా తీవ్రత నమోదు
- అప్రమత్తంగా ఉండాలంటూ కేమన్ ప్రభుత్వ హెచ్చరికలు
కరీబియన్ దీవుల్లో సంభవించిన భారీ భూకంపం జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. భూకంపం ధాటికి పలు భవనాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. జమైకా, క్యూబా, కేమన్ దీవుల మధ్య సముద్రంలో పది కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది.
అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ఈ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యునైటెడ్ స్టేట్స్ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం నుంచి సముద్ర తీర ప్రాంతానికి 300 కిలోమీటర్ల వరకు సునామీ తరంగాలు వస్తున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. క్యూబా, హోండూరస్, మెక్సికో, కేమన్, దీవులతోపాటు బెలిజ్, జమైకాలోని పలు ప్రాంతాలకు సునామీ ప్రమాదం పొంచి వుందని పేర్కొంది.