Telugudesam: ఏపీ శాసనమండలి రద్దును ఖండిస్తున్నా.. అసలు మేం చేసిన తప్పేంటి?: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
- సెలెక్ట్ కమిటీకి పంపామన్న ఆక్రోశంతోనే రద్దు తీర్మానం
- ఇది చాలా దురదృష్టకరం.. విచారకరం
- మండలికి రాజకీయాలు ఆపాదించడం తగదు
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం చేయడం విచారకరమని, తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల అంశాన్ని సెలెక్ట్ కమిటీకి పంపామన్న ఆక్రోశంతోనే మండలి రద్దుపై తీర్మానం చేయడం చాలా దురదృష్టకరమని విమర్శించారు. మండలికి రాజకీయాలు ఆపాదించడం వైసీపీ ప్రభుత్వానికి తగదన్న చంద్రబాబు, మండలిలో టీడీపీ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో డ్రామాలు ఆడి మండలి రద్దు తీర్మానం చేశారని, మొదట 121 మంది సభ్యులు అని, ఆ తర్వాత 133 మంది సభ్యులు అని తేల్చారని విమర్శించారు.
మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో కౌంటింగ్ సమయంలో సీఎం జగన్ వద్దకు సంబంధిత సెక్రటరీ వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చాడు? అని ప్రశ్నించారు. కోరం బెల్స్ కొట్టిన తర్వాత డివిజన్ ప్రెస్ చేశారా? అన్న విషయం చెప్పలేదని, ఇదంతా నాటకీయత అని మండిపడ్డారు. తాను సీఎంగా చేసిన పద్నాలుగేళ్ల కాలంలో అసెంబ్లీలో గానీ మండలిలో గానీ సంబంధిత సెక్రటరీ తన వద్దకు వచ్చిన సందర్భాలు లేవని గుర్తుచేసుకున్నారు.
అలాంటి వాళ్లు తన కేబినెట్ లో ఉన్నారని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా?
అసెంబ్లీలో ఉన్న తమ సభ్యుల్లో మేధావులున్నారని చెప్పుకుంటున్న సీఎం జగన్ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాడని, వారి సభ్యుల్లో నేరస్థులు కూడా ఉన్నారని చెప్పినట్టయితే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషపడేవారని సెటైర్లు విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక నేరస్థుల ముఠా అని, అలాంటి వాళ్లు తన కేబినెట్ లో ఉన్నారని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.