Sake Sailajanath: అంటే బాగుండదు కానీ, మీరు హైదరాబాద్ వెళ్లిరావడానికి ఎంత ఖర్చవుతోంది?: సీఎం జగన్ పై శైలజానాథ్ విసుర్లు
- మండలి రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ తీర్మానం
- ఇది జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్న శైలజానాథ్
- మండలి రద్దు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
శాసనమండలి రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వ క్యాబినెట్ లో నిర్ణయించడం పట్ల ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని అన్నారు. శాసనమండలికి ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చవుతోందని అంటున్నారని, అలాంటి మండలి అవసరమా అని సుదీర్ఘంగా ఉపన్యాసమిస్తున్నారని మండిపడ్డారు.
"అంటే బాగుండదు కానీ, మీరు హైదరాబాద్ వెళ్లి రావడానికి రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చవుతుందని మీ వాళ్లే చెబుతున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత మీ సొంత ఇళ్లకు రంగులు వేసుకున్నట్టు, పార్టీ రంగుల్ని గ్రామ ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు వేసుకుంటున్నారు. అందుకోసం 1400 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకుంటున్నారు. మరి దీనికి సమాధానం చెబుతారా మీరు?" అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.
మండలి రద్దు నిర్ణయాన్ని సీఎం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని విపక్షాలు, మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సంఖ్యాబలం ఉంది కదా అని ఇష్టం వచ్చిన చర్యలు తీసుకోవడం సరికాదని, ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను ప్రశ్నించినవారిపై అభివృద్ధి నిరోధకులన్న ముద్రవేయడం సబబు కాదని హితవు పలికారు.