Shiva Bhojan: పేదల కడుపు నింపేందుకు... మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
- రూ. 10కే భోజనం పథకం
- 'శివ భోజన్' కేంద్రాలు ప్రారంభం
- దశలవారీగా విస్తరిస్తామన్న ఉద్ధవ్
రాష్ట్రంలోని పేదలు ఆకలితో పస్తులుండకుండా చూడటమే తమ లక్ష్యమని, అందుకోసం నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. కొత్తగా 'శివ భోజన్' కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇక్కడ రూ. 10కే భోజనాన్ని అందిస్తామని తెలిపారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో ఇవి ప్రారంభమవుతాయని, ఆపై రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు.
నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పలువురు మంత్రులు వివిధ ప్రాంతాల్లో 'శివ భోజన్' కేంద్రాలను ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రవేశపెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా థాకరే కదులుతున్నారు.
ఇక ఈ భోజనం చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరంటూ వచ్చిన వార్తలను రాష్ట్ర మంత్రి భుజ్ బల్ ఖండించారు. ఎటువంటి గుర్తింపు కార్డునూ చూపకుండా పేదలు కడుపునింపు కోవచ్చని ఆయన అన్నారు. భోజనం అయిపోయేంత వరకూ తొలుత వచ్చిన వారికి తొలుత ప్రాతిపదికన అందిస్తామని తెలిపారు.