India: కివీస్ ను ఆటాడుకున్న టీమిండియా... ఆక్లాండ్ లో వరుసగా మరో గెలుపు
- మొదట బ్యాటింగ్ చేసిన కివీస్
- టీమిండియా టార్గెట్ 133 రన్స్
- 17.3 ఓవర్లలో ఛేదించిన కోహ్లీ సేన
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. ఆక్లాండ్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించి ఆతిథ్య కివీస్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కివీస్ విసిరిన 133 పరుగుల లక్ష్యాన్ని మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) విఫలమైనా సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) సమయోచితంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ కు శ్రేయాస్ అయ్యర్ కూడా తోడవడంతో న్యూజిలాండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. అయ్యర్ 33 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 44 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే ఓ భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు.
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐదు టి20ల సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆక్లాండ్ లోని ఇదే మైదానంలో జరిగిన తొలి టి20లో సైతం భారత్ నే విజయలక్ష్మి వరించింది. ఇరు జట్ల మధ్య మూడో టి20 జనవరి 29న హామిల్టన్ లో ని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.