Revanth Reddy: ఏ ఎన్నికల్లో అయినా కేసీఆర్ ఆయుధం ‘బ్లాక్ మెయిల్’: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి
- ఎన్నికల నిర్వహణ, ఫలితాల గురించి ప్రజలకు చెప్పాలి
- ఆ బాధ్యత మా పార్టీపై ఉంది
- ‘కాంగ్రెస్’కు నష్టం చేకూర్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది
ఏ స్థాయి ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నో విజయాలు, ఒడిదుడుకులను చూసిందని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి, ఎన్నికల నిర్వహణ గురించి ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందని అన్నారు.
ఏ ఎన్నికల్లో అయినా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎన్నుకున్న ఆయుధం ‘బ్లాక్ మెయిల్’ అని ఆరోపించారు. 120 మున్సిపాలిటీల్లో, 10 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ఓడిపోతే పదవులు ఊడిపోతాయని తమ మంత్రులను స్వయంగా కేసీఆరే బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.
‘బ్లాక్ మెయిల్’ ఆయుధాన్ని మంత్రులకు ఇచ్చి అచ్చోసిన ఆంబోతుల్లా వారిని ప్రజలపైకి వదిలితే, ఈ ఆంబోతులు ప్రజలపై, ప్రతిపక్షాలపై, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు, బెదిరింపులు, కేసులు బనాయించడం ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఎన్నికల్లో విజయానికి కార్యకర్తలను, ప్రజలను కేసీఆర్ నమ్ముకోలేదని, డబ్బు, మద్యం, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారులపై ఆయన ఆధారపడి విజయం సాధించారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పెట్టిన పెట్టుబడి డబ్బు, పోలీసులు, మద్యం, ఎన్నికల నిర్వహణ అధికారులు అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి తాము శాయశక్తులా ప్రయత్నించామని అన్నారు.
ఎన్నికల నిర్వహణ తీరు గురించీ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రకటన విడుదల నుంచి మొదలు పెడితే.. ఎన్నికల తేదీలు, రిజర్వేషన్ల కేటాయింపు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు.. ఇలా అన్ని అంశాల్లో నియమనిబంధనలను ఉల్లంఘించారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా నష్టం చేకూర్చే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని దుమ్మెత్తిపోశారు.