Telugudesam: మీ దగ్గర ఉన్నది విజ్ఞులు కాదు.. నేరస్థులు: జగన్ వ్యాఖ్యలకు బాబు కౌంటర్
- వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 151
- అందులో 86 మందిపై డిక్లేర్డ్ క్రిమినల్ కేసులు ఉన్నాయి
- వైసీపీలో నోటోరియస్ క్రిమినల్స్ ఉన్నారు
శాసనమండలి అవసరం లేదంటూ ఏపీ సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత శాసనసభలో డాక్టరేట్లు పొందిన వాళ్లు, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, నటులు, జర్నలిస్టులు.. విజ్ఞులు ఉండగా శాసన మండలి అవసరం ఏముందని జగన్ ప్రశ్నించారని అన్నారు. బిల్లులకు ఆమోదం లభించకుండా శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడ్డుతగిలారన్న ఉద్దేశంతో అసలు అదే ఉండటానికి వీల్లేదన్న పరిస్థితికి వచ్చారని, వైసీపీలో ఉన్నది విజ్ఞులు కాదు నోటోరియస్ క్రిమినల్స్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల గురించి ప్రస్తావించారు.
‘మీ దగ్గర ఉండే వాళ్లు విజ్ఞులు కాదు నేరస్థులు.. కరుడుగట్టిన నేరస్థులు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏడీఆర్ రిపోర్ట్ గురించి ప్రస్తావించారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మందిలో 86 మందిపైన డిక్లేర్డ్ క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. క్రైమ్ అగనెస్ట్ విమెన్ ఆరుగురిపైన, మర్డర్ కేసు ఒకరిపైన, అటెంప్ట్ టూ మర్డర్ కేసులు 10 మంది పైన, కిడ్నాప్ కేసులు ఏడుగురిపైనా, కన్ విక్టెడ్ కేసులు 8 మందిపైన, ఇతర కేసుల్లో 54 మంది ఉన్నారని ఆ రిపోర్ట్ లో వివరాలను చదివి వినిపించారు.