: ఔరా.. చాకో మాటల చాతుర్యం!
యూపీఏ అజెండాలో తెలంగాణకు ప్రాముఖ్యం లేదన్న ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అంతలోనే మాటమార్చారు. తన వ్యాఖ్యల పట్ల పొరబడ్డారంటూ, నెపం మీడియాపైకి నెట్టే ప్రయత్నం చేశారు. యూపీఏ అజెండాలో తెలంగాణే ముఖ్యమైనదని పేర్కొంటూ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటి క్రితం వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.
చాకో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం తగదంటూ, ఈనెల 30లోపు ప్రత్యేక రాష్ట్ర విషయమై తేల్చకుంటే పార్టీని వీడుతామని మందా, రాజయ్య, వివేక్ హెచ్చరించారు. దీనికి తోడు టీఆర్ఎస్ నేత హరీశ్ రావు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అటు చాకోను ఇటు కాంగ్రెస్ ఎంపీలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో చాకో దిద్దుబాటుకు ఉపక్రమించారు. అధిష్ఠానానికి తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసంటూ.. ప్రస్తుతం కొనసాగుతోన్న చర్చల ప్రక్రియ ముగిసిన అనంతరం త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.