Mamata Banerjee: నాడు నేతాజీ చేసిన పనినే ఇప్పుడు చేస్తే తరిమికొడుతున్నారు: మమత బెనర్జీ
- నాడు బోస్ లౌకిక భారతదేశం కోసం పోరాడారు
- విభజన రాజకీయాలను ఆయన వ్యతిరేకించారు
- బోస్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ లౌకిక భారతదేశం కోసం పోరాడితే, ఇప్పుడు ఆ పని చేస్తున్న వారిని తరమికొట్టే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా డార్జిలింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విభజన రాజకీయాలను బోస్ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు.
బోస్ తన పోరాటాల ద్వారా అందరి విశ్వాసాలను గౌరవించాలన్న సందేశాన్ని ఇచ్చారన్నారు. లౌకిక భారతదేశం కోసం పోరాడడం ద్వారా ఆయనకు ఘన నివాళి ఇవ్వాలని మమత పిలుపునిచ్చారు. బోస్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బోస్ అదృశ్యమై 70 ఏళ్లు గడుస్తున్నా ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన అదృశ్యం గురించి నిజాలు తెలుసుకోకపోవడం సిగ్గు చేటని కేంద్రంపై మమత విరుచుకుపడ్డారు.