Hyderabad: చోరీలు...జల్సాలు: ఈ దొంగ రూటే సెపరేటు!
- వేసిన చొక్కా వేయడు
- ఖరీదైన వస్తువులే కొంటాడు
- చోరీ డబ్బు ఖర్చయ్యాకనే మరో చోరీ
ఈ దొంగను చూస్తే అప్పుడెప్పుడో వచ్చిన సినిమాలోని 'అనుభవించు రాజా...పుట్టింది... పెరిగింది...' అన్న పాట గుర్తుకు వస్తుంది. చేసేది దొంగతనాలు. వ్యవహార శైలి చూస్తే జమిందార్లు కూడా సరితూగరేమో. బాల్యం నుంచి చోరీలు, జల్సాలే జీవితంగా సాగిపోతున్న ఈ దొంగ తీరేంటో నిన్న లాలాగూడ పోలీసులు వెల్లడిస్తుంటే ఆశ్చర్యపోవడం మీడియా ప్రతినిధుల వంతయింది.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్‌కు చెందిన సతీష్ కుమార్ నాయుడు (44) మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగు చూశాయి. జల్సాల కోసమే జీవితం అన్నట్లుంది అతని జీవనయానం.
పదహారేళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ నగరానికి వచ్చేశాడు. తొలిసారి దొంగతనం చేసి చిక్కడంతో పోలీసులు జువైనల్ హోం (బాలనేరస్తుల కారాగారం)కు పంపారు. విడుదలయ్యాక వరుసగా మూడిళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. కొన్నాళ్ల తర్వాత పోలీసులకు చిక్కి మళ్లీ జైలుకు వెళ్లాడు. ఇలా తొలి దొంగతనం నుంచి అతని జీవితం అలాగే సాగిపోతోందని పోలీసులు తెలుసుకున్నారు.
పోలీసులకు చిక్కినా పెద్దగా కష్టం లేకుండా నేరం ఒప్పేసుకోవడం అతని స్టైల్. చోరీ చేసిన డబ్బుతో ఖరీదైన దుస్తులు, వస్తువులు కొని వాడుతాడు. ఒకసారి వేసిన డ్రెస్ మరోసారి వేయడు. మిగిలిన డబ్బుతో విజయవాడ, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేసేవాడు. ఓ చోరీ ద్వారా వచ్చిన నగదు మొత్తం అయిపోయాకే మరో చోరీకి పాల్పడతాడు.
గత ఏడాది సెప్టెంబరు 17న జైలు నుంచి విడుదలయ్యాడు. అదేనెల 27న లాలాగుడ ప్రాంతంలోని ఓ ఇంట్లో చోరీ చేశాడు. దాదాపు నాలుగు తులాల బంగారాన్ని అపహరించి వాటిని కుదువ పెట్టాడు. వచ్చిన డబ్బు ఖర్చయ్యాక గోపాలపురం స్టేషన్ పరిధిలో మరో ఇంట్లో నాలుగు తులాల బంగారం చోరీ చేశాడు. ఆ డబ్బుతో విహార యాత్రలకు వెళ్లి వచ్చాడు.
ఈనెల 20న లాలాగూడ రైల్వే క్వార్టర్స్ లో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. 21న మెట్టుగుడలో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కాడు. ఇతని వద్ద నుంచి రూ.3.2 లక్షల విలువైన బంగారం, ఇతర ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.