Andhra Pradesh: సీన్ రివర్స్... ఏపీ శాసనమండలిలో చైర్మన్ పోడియం వద్దకు దూసుకొచ్చిన మంత్రులు
- అసెంబ్లీలో స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ యత్నం
- మండలిలో విపక్షపాత్ర పోషిస్తున్న వైసీపీ
- చైర్మన్ షరీఫ్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న బొత్స
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుండడం ఈ రెండ్రోజుల్లో ఎక్కువసార్లు కనిపించిన దృశ్యం. అయితే, శాసనమండలిలో సీన్ రివర్స్ అయింది. చైర్మన్ పోడియం వద్దకు వైసీపీ మంత్రులు దూసుకెళ్లడమే కాదు, చైర్మన్ షరీఫ్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించడం దర్శనమిచ్చింది.
అసలేం జరిగిందంటే... ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులపై చర్చించాలని వైసీపీ సభ్యులు కోరారు. అయితే రూల్ 71 కింద చర్చ ప్రారంభించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. మొదట దీన్ని చర్చించి ఆపై మిగతా అంశాలు చర్చిద్దామని అన్నారు. శాసనమండలిలో టీడీపీకి అధిక బలం ఉన్న సంగతి తెలిసిందే. దాంతో చైర్మన్ షరీఫ్ టీడీపీ సభ్యుల కోరిక మేరకు రూల్ 71 కింద చర్చను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
ఈ పరిణామంతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైసీపీ మంత్రులు, ఆ పార్టీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులపై చర్చించాలంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. ఓ దశలో మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని, చైర్మన్ షరీఫ్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ తీరు చూస్తుంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఉందని, చైర్మన్ పక్షపాత ధోరణి వీడాలని పేర్కొన్నారు. సభలో టీడీపీ సభ్యులు చెప్పినట్టుగానే నడుచుకునేట్టయితే నిబంధనల పుస్తకం ఎందుకని ప్రశ్నించారు. మంత్రి బొత్స వ్యాఖ్యలకు ప్రతిగా టీడీపీ సభ్యులు కూడా నినాదాలు చేయడంతో సభలో వాడీవేడి వాతావరణం ఏర్పడింది.