Dwarampudi Chandrasekhar Reddy: పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడిపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
- పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
- ఆయన ఇంటిని చుట్టుముట్టిన కార్యకర్తలపై దాడి
- చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు జన సామ్రాజ్యం పార్టీ ఫిర్యాదు చేసింది. ఇటీవల ద్వారంపూడి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టారని విమర్శించారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే నువ్వూ ఓ నాయకుడివేనా? అని ప్రశ్నిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన పక్కన కాకినాడ ఎంపీ వంగా గీత కూడా ఉన్నారు.
పవన్‌పై ద్వారంపూడి వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు, మహిళలు కాకినాడలోని ఆయన ఇంటిని చుట్టుముట్టారు. దీంతో రంగంలోకి దిగిన ద్వారంపూడి అనుచరులు కర్రలు, రాళ్లతో వారిపై దాడిచేశారని, ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ జన సామ్రాజ్యం పార్టీ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ మానవహక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు.