murali mohan: శిరిడీ సాయిబాబా జన్మస్థల వివాదంపై మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు
- పథ్రీ అంశం భక్తుల నమ్మకాలపై ఆధారపడి ఉంది
- రూ.100 కోట్లు కేటాయించినంత మాత్రాన కంగారుపడాల్సిన అవసరం లేదు
- ఉద్ధవ్ చర్చలకు రమ్మని ఇప్పటికే ఆహ్వానించారు
- జన్మస్థలం ఎక్కడ ఉన్న శిరిడీ బాబాగానే అందరికీ ఆయన సుపరిచితం
శిరిడీ సాయిబాబా జన్మస్థల వివాదంపై మాజీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిరిడీ సాయిబాబా జన్మ స్థలమని పేరున్న మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలోని పథ్రీ అంశం భక్తుల నమ్మకాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే రూ.100 కోట్లు కేటాయించినంత మాత్రాన కంగారుపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఈ విషయంపై ఉద్ధవ్ చర్చలకు రమ్మని ఆహ్వానించారని, శిరిడీ ట్రస్ట్ సభ్యులు అక్కడికి వెళ్లి చర్చించాలని మురళీ మోహన్ అన్నారు. ఈ అంశాన్ని అనవసరంగా తీవ్రతరం చేయవద్దని ఆయన కోరారు. సాయినాథుడి భక్తుల మనోభావాలను కించపర్చవద్దని ఆయన అన్నారు. సాయిబాబా జన్మస్థలం ఎక్కడ ఉన్నా, బాబా ఎక్కడ పెరిగినా శిరిడీ బాబాగానే అందరికీ ఆయన సుపరిచుతులని మురళీ మోహన్ అన్నారు.