Andhra Pradesh: అమరావతి పేరు చెప్పి అవినీతి కేంద్రంగా మార్చారు: వైసీపీ నేత కరణం ధర్మశ్రీ
- అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది
- చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు
- ప్రజల ముందుకు వచ్చి ఆయన క్షమించాలని కోరాలి
- రేపు అక్రమాలకు సంబంధించి వివరాలను వెల్లడిస్తాం
అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న భూ అక్రమాలపై వైసీపీ నేత, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వివరిస్తూ.. అమాయకులను ముందుంచి టీడీపీ నేతలు మంచి నేతలుగా చలామణి అవుతున్నారన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కరణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు పాల్పడ్డ భూముల అక్రమాలకు సంబంధించిన వివరాలను, పేర్లతో సహా మీముందు ఉంచుతున్నానని ఆయన చెప్పారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు.
చంద్రబాబు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెపుతూ.. అధికారంలో లేనప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానులు మంచిదే అని చంద్రబాబుకు తెలిసీ, రాజకీయంగా పునాది దొరుకుతుందనే.. ఉద్యమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని గుంటూరు ప్రజలను కోరారు. అవినీతికి పాల్పడ్డవారిపై చట్టం ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి ఇప్పుడు సీబీఐ విచారణ చేయమంటున్న చంద్రబాబు నాడు సీఎంగా అసెంబ్లీలో సీబీఐ విచారణకు నిరాకరించారని పేర్కొన్నారు. అప్పుడు అసెంబ్లీలో వీడియోలో మాట్లాడిన రికార్డింగ్ ను ప్రదర్శించారు. బినామీలను అడ్డంపెట్టుకుని ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. 2014, 2015 సంవత్సరాల్లో బినామీల పేర్ల మీద భూములు కొన్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించి సర్వే నెంబర్ల వివరాలు, సంబంధించిన అధికార పత్రాలను ప్రదర్శించారు. సీబీఐ, సీఐడీలు అమరావతి ప్రాంతంలో అవినీతి జరిగిందంటూ నిరూపించాయన్నారు. ప్రజలు మిమ్మల్ని ఆదరించాలంటే క్షమించాలని కోరాలని కరణం సూచించారు. రేపు టీడీపీ నేతల అక్రమాల వివరాలను సాక్ష్యాలతో సహా వెల్లడిస్తామన్నారు.