Pakistan: ఎస్సీవో సదస్సుకు ఇమ్రాన్‌ను ఆహ్వానించనున్న భారత్
- ఎనిమిది సభ్యదేశాలు సహా అంతర్జాతీయ ప్రతినిధులకూ ఆహ్వానం
- ఐరాస వేదికగా పాక్ చేస్తున్న ప్రయత్నాలపై ధ్వజం
- ద్వైపాక్షిక చర్చలే మేలన్న రవీశ్ కుమార్
ఢిల్లీలో ఈ ఏడాది జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సదస్సుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను భారత్ ఆహ్వానించనుంది. ఎస్సీవోలో సభ్యదేశమైన పాకిస్థాన్‌ను ఆహ్వానించనున్నట్టు కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఎనిమిది సభ్య దేశాలు, నాలుగు అబ్జర్వర్ స్టేట్స్, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు.
అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్, చైనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై తీవ్రంగా మండిపడ్డారు. మిత్రదేశం చైనా ద్వారా పాక్ చేస్తున్న ప్రయత్నాలు హేయమైనవని దుయ్యబట్టారు. ద్వైపాక్షికంగా పరిష్కారం కావాల్సిన అంశాలను ఐక్యరాజ్య సమితికి పాక్ తీసుకెళ్తోందన్నారు. పాక్ ప్రయత్నాలను భద్రతా మండలి సభ్యులు అడ్డుకోవడం హర్షణీయమన్నారు. భారత్-పాక్‌కు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం కావాలని రవీశ్ కుమార్ తేల్చి చెప్పారు.