Nirbhaya: నిర్భయ దోషుల్లో మొదలైన మరణభయం... విచిత్రంగా ప్రవర్తిస్తున్న నలుగురు దోషులూ!
- ఇంతకాలమూ గంభీరంగా కనిపించిన దోషులు
- ఇప్పుడు సరిగ్గా తినకుండా ఆందోళనలో
- శిక్ష అమలు ఆలస్యం కావచ్చంటున్న న్యాయ నిపుణులు
తాము ఉరిశిక్ష నుంచి తప్పించుకోవచ్చని భావించారో లేక, శిక్ష అమలు ఇప్పటికిప్పుడే ఉండదన్న భ్రమలో ఉన్నారేమో, ఇంతకాలమూ గంభీరంగా, ఎటువంటి వణుకు లేకుండా తీహార్ జైల్లో ఉన్న నలుగురు నిర్భయ దోషులకూ ఇప్పుడు మరణభయం పట్టుకుంది. తమపై డెత్ వారెంట్ జారీ కావడం, క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టివేయడం, 22న ఉరి తీతకు ఏర్పాట్లు జరుగుతూ ఉండటంతో, నలుగురు దోషులూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ, ఏంటేంటో చేస్తున్నారని, వారికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని జైలు వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యంగా వినయ్ శర్మ ఎంతో ఆందోళనతో ఉన్నాడని తెలుస్తోంది. నలుగురిలో వినయ్ అత్యంత పిన్న వయస్కుడన్న సంగతి తెలిసిందే. తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ, చాలా భయంతో ఉంటున్నాడని జైలు అధికారి ఒకరు తెలిపారు. వీరికి ఇప్పటికే ఆహారాన్ని తగ్గించామని, దాన్ని కూడా తినడం మానేశాడని అన్నారు. గత ఐదారు రోజులుగా వీరంతా సరిగ్గా నిద్రకూడా పోవడం లేదని వెల్లడించారు. శిక్షను అమలు చేసే సమయంలో వీరి మానసిక స్థితి సక్రమంగా ఉండాల్సివుందని, అందుకోసం వారితో రోజూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ఇక మంగళవారం నాడు వినయ్ శర్మను అతని తండ్రి కలిశాడు. ముఖేశ్ సింగ్ ను అతని తల్లి కలిసింది. ఇక పవన్ గుప్తా తల్లిదండ్రులు ఈ నెల 7న వచ్చి వెళ్లారని, అక్షయ్ ఠాకూర్ భార్య, గత సంవత్సరం నవంబర్ లో చివరిసారిగా వచ్చినట్టు జైలు వర్గాలు తెలిపాయి. ఉరి శిక్ష అమలు తేదీని ప్రకటించిన తరువాత దోషుల బంధువులు వారిని దూరం పెట్టారని, ఒకరిద్దరు మినహా వారితో ములాఖత్ కు ఎవరూ రాలేదని ఆ వర్గాలు వెల్లడించాయి.
చివరిసారిగా కుటుంబ సభ్యులను ఎప్పుడు కలవాలని భావిస్తున్నారో చెబితే, పిలిపిస్తామని నలుగురికీ స్పష్టం చేసినప్పటికీ, వారి నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. దోషులు స్పందించకుంటే, తుదిసారిగా కుటుంబీకులను కలిసే తేదీని తామే నిర్ణయిస్తామని తెలిపారు.
ఇదిలావుండగా, వీరికి 22న శిక్ష అమలు జరిగే అవకాశాలు అతి స్వల్పమని, నిందితుల ముందు క్షమాభిక్ష ఆప్షన్ వుండడంతో శిక్ష అమలులో జాప్యం జరగవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.