Flights: హైదరాబాద్ నుంచి నేటి సాయంత్రం రాజమండ్రికి విమానం టికెట్ ఎంతో తెలుసా... రూ. 19,518 మాత్రమే!
- ప్రైవేటు ట్రావెల్స్ కు తీసిపోని విమానయాన సంస్థలు
- విదేశీ ప్రయాణం కంటే అధిక ధరలు
- అయినా తగ్గని డిమాండ్
హైదరాబాద్ టూ రాజమండి... బస్సులో ప్రయాణం పట్టుమని 10 గంటలు పట్టదు. విమానంలో అయితే గంటసేపు. సంక్రాంతి సీజన్ లో సొంత ఊర్లకు వెళ్లేవారి నుంచి అటు ఆర్టీసీ, ఇటు ప్రైవేటు ట్రావెల్స్ అడ్డంగా దోచుకుంటున్న వేళ, విమానయాన సంస్థలు కూడా తామేమీ తక్కువ తీసిపోలేదని నిరూపిస్తున్నాయి.
నేడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వెళ్లాలని భావించేవారు రూ. 19,518 చెల్లించుకోవాల్సి వుంటుంది. సాయంత్రం 3.45 నిమిషాలకు ఈ విమానం బయలుదేరుతుంది. ఇక తిరుపతికి రూ. 12,027, విశాఖకురూ. 12,843, విజయవాడకు రూ. 14,837 వరకూ ధర పలుకుతోంది. అంటే ఇక్కడి నుంచి వేల కిలోమీటర్ల దూరంలోని మలేషియా, కొలంబో, థాయ్ లాండ్ వంటి విదేశాలకు వెళ్లే సర్వీసులు వసూలు చేస్తున్న టికెట్లతో పోలిస్తే, 500 కిలోమీటర్ల దూరానికి వసూలు చేస్తున్న ధరే అధికమన్నమాట. ఇంత ధర వసూలు చేస్తున్నప్పటికీ, టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోతున్నాయని తెలుస్తోంది.