Congress: కాంగ్రెస్ నేతృత్వంలో కీలక భేటీ... డుమ్మా కొట్టిన మమత బెనర్జీ, మాయావతి!
- సీఏఏపై కాంగ్రెస్ నేతృత్వంలో సమావేశం
- పశ్చిమ బెంగాల్ లో గొడవల నేపథ్యంలో మమత గైర్హాజరు
- కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆగ్రహంతో ఉన్న మాయావతి
- తమను అసలు పిలవనే లేదంటున్న ఆప్
వివాదాస్పదమైన సీఏఏ (సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ - పౌరసత్వ సవరణ చట్టం)పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విపక్షాల సమావేశం నేడు జరుగనుండగా, కీలకమైన తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల అధినేత్రులు మమత బెనర్జీ, మాయావతి గైర్హాజరు కావాలని నిర్ణయించుకోవడం కొత్త చర్చకు దారితీసింది. విపక్షాల్లో ఐక్యత లేదని చెప్పేందుకు ఇదే నిదర్శనమని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తనను ఈ సమావేశానికి ఆహ్వానించలేదని చెబుతూ, తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
కాగా, గత వారంలో ట్రేడ్ యూనియన్ సంఘాలు సమ్మె చేసిన సమయంలో విధ్వంసం జరిగిందని గుర్తు చేస్తూ, ఇందుకు వామపక్ష పార్టీలే కారణమని, ఈ సమయంలో తాను రాష్ట్రంలో ఉండి పరిస్థితులను చక్కదిద్దాల్సి వుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ సమావేశం తన సలహాతోనే జరుగుతున్నప్పటికీ, తాను వెళ్లే పరిస్థితి లేదన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తన పోరాటం సాగుతుందని తెలిపారు.
ఇదిలావుండగా, రాజస్థాన్ లో గత సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించగా, కాంగ్రెస్ నేతలు తమ వారికి ప్రలోభాలను ఆశ చూపించారని ఆరోపిస్తున్న మాయావతి, ఈ సమావేశానికి వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. రాజస్థాన్ లోని కోటాలో చిన్నారుల మరణాలపై ఇటీవల ఆమె సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.