Prudhviraj: ఆ ఆడియోలో ఉన్న గొంతు నాది కాదు: పృథ్వీ
- టీటీడీ ఉద్యోగినితో పృథ్వీ సరస సంభాషణ అంటూ వార్తలు
- స్పందించిన పృథ్వీ
- తప్పుంటే శిక్షించాలని వ్యాఖ్యలు
ఓ ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సరస సంభాషణ సాగించాడంటూ ఓ ఆడియో క్లిప్పింగ్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజధాని రైతులపై వ్యాఖ్యలు చేసి అధిష్ఠానం దృష్టిలో పడిన పృథ్వీని ఈ ఆడియో మరింత ఇరకాటంలోకి నెట్టింది. దీనిపై పృథ్వీ స్వయంగా వివరణ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగినితో తాను సంభాషించినట్టు చెబుతున్న ఆడియో ఫేక్ అని స్పష్టం చేశారు. అందులో గొంతు తనది కాదని అన్నారు.
తనపై కక్షతోనే ఈ చర్యకు పాల్పడ్డారని, ఎవరు చేశారన్నది భగవంతుడికే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని వైసీపీ హైకమాండ్ కు వివరించానని, విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తన తప్పు ఉంటే శిక్షించాలని పృథ్వీ తెలిపారు. ఇక అమరావతి రైతులపై తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడం పట్ల కూడా ఆయన స్పందించారు. తాను బినామీ రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించానని, తన మాటలు ఎవర్నైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు.