Telangana: మునిసిపాలిటీల్లో ఎప్పుడైనా కేటీఆర్ తనిఖీలు చేశారా?: రేవంత్ రెడ్డి
- డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యాయి?
- ఏ మునిసిపాలిటీలో అయినా ‘భగీరథ’ నీళ్లిచ్చారా?
- ప్రజాకోర్టు నిర్వహించేందుకు కేటీఆర్ సిద్ధమా?
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయమాటలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మొదటి కృష్ణుడు కేసీఆర్, రెండో కృష్ణుడు కేటీఆర్ అని, కేసీఆర్ మాటలు చెబుతున్నారని, కేటీఆర్ ఏమో తన సమర్ధవంతమైన పరిపాలన చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పావనిని అడిగితే కేటీఆర్ సమర్ధత ఏపాటిదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
ఎప్పుడైనా మునిసిపాలిటీల్లో తనిఖీలు చేశారా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యాయి? ఏ మునిసిపాలిటీలో అయినా మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజాకోర్టు నిర్వహించేందుకు కేటీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన కేసీఆర్ కు మొహం చెల్లకపోవడంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ ను తెరపైకి తెచ్చారని విమర్శించారు.