Jagan: జగన్ పై దిశ చట్టాన్ని అమలు చేయాలి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత
- అమరావతి మహిళలపై దాడులు చేయిస్తున్నారు
- సమాధానాలు చెప్పకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు
- ఆడదాన్ని చూసి జగన్ భయపడుతున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేశారు. జగన్ పాలనలో అమరావతి ప్రాంత మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వారి శరీరాలు రక్తమోడుతున్నాయని... ఇంత మంది మహిళలను బాధిస్తున్న జగన్ పై దిశ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. మహిళలను కంటతడి పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో మగాళ్లు లేరా? ఆడవాళ్లు వచ్చి ధర్నాల్లో పాల్గొంటున్నారని వైసీపీ నాయకురాలు ఒకరు అసభ్యకరంగా మాట్లాడారని... ఒక ఆడది అయ్యుండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
ఓ మంత్రి మాట్లాడుతూ అమరావతి ఉద్యమం కాదు, ఊరగాయబద్దా కాదని అన్నారని... ఒకసారి అమరావతికి రావయ్యా అని ఆయనకు చెబుతున్నానని అనిత సవాల్ విసిరారు. మా మహిళలు నీకు ఊరగాయ పెడతారో, ఇంకేం పెడతారో తెలుస్తుందని అన్నారు. వాళ్లకు ఉంగరాలు ఉన్నాయి, తాళిబొట్లు ఉన్నాయంటూ వైసీపీ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని... రైతులకు బంగారం ఉండదా? మంచి బట్టలు ఉండవా? అని ప్రశ్నించారు. వాళ్లు పండించే తిండి తినే మనమే ఇలా ఉన్నప్పుడు... రైతులు ఇంకెలా ఉంటారో అర్థం చేసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో మహిళల గురించి చెత్తగా రాస్తున్నారని అన్నారు.
విజయవాడలో మధ్యాహ్నం జరగబోయే మహిళా ర్యాలీకి ఎవరైనా హాజరవుతారనే భయంతోనే ఎక్కడికక్కడ మహిళలను అరెస్ట్ చేస్తున్నారని అనిత మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డీ... నీవు ఒక్క ఆడదానికి భయపడుతున్నావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా... ఈ రోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
కోర్టుకు వెళ్లే అంశాన్ని డైవర్ట్ చేయడానికే... ఆడవాళ్లపై దాడి చేయిస్తున్నారని అన్నారు. మహిళలపై దాడులు చేయిస్తున్న జగన్ పై దిశ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మకు చిత్తశుద్ధి ఉంటే... మహిళలపై జరిగిన దాడులపై సమాధానం చెప్పాలని అన్నారు.