Andhra Pradesh: మొదట రాజధానిని విజయవాడలోనే ఏర్పాటు చేద్దామనుకున్నాం!: చంద్రబాబునాయుడు
- అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ఏర్పాటు
- వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం ఏపీ
- మంచి రాజధాని నిర్మించాలనే అమరావతిని ఎన్నుకున్నాం
విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానిక వేదిక కల్యాణ మంటపంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, ఏపీలో ఉన్నటువంటి సహజ వనరులు ఇక ఏ రాష్ట్రంలో లేవని, అలాగే, ఇక్కడ ప్రజానీకం చాలా తెలివైందని అన్నారు. దేశంలో తూర్పు భాగంలో చూస్తే కనుక వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం ఏపీ అని, అలాగే, దేశానికి మధ్యలో ఉండేది, దక్షిణ భారతదేశంలో ఇన్ని నదుల నీళ్లు ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశేనని అన్నారు.
విజయవాడ రాజధానిగా ఉంటే బాగుంటుందని నాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తమ హయాంలో రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేద్దామని తొలుత అనుకున్నామనీ, అయితే, మంచి రాజధాని నిర్మించాలంటే విజయవాడ-గుంటూరు మధ్య ఉంటే బాగుంటుందని భావించి ఇక్కడ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయడమన్నది ఎవరికో అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు.