Asaduddin Owaisi: గంటన్నర పాటు హింసాకాండ జరిగితే నిలువరించలేకపోయారా?: అసదుద్దీన్ మండిపాటు
- దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ కుట్ర
- 10న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ
- జేఎన్‌యూలో దాడి క్రూరమైనది
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై మరోమారు మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, శ్రేణులతో సోమవారం నిర్వహించిన అత్యవసర సమావేశం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశాన్ని మత ప్రాతిపదికన విడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
అందులో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)లను తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్న ఒవైసీ.. ప్రజలు జాతీయ జెండాలతో ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
యూనివర్సిటీల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, ప్రధాని ఎందుకు నోరు విప్పడం లేదని ఒవైసీ నిలదీశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడి క్రూరమైనదని, పథకం ప్రకారమే దాడి జరిగిందని అన్నారు. అర్ధరాత్రి గంటన్నరపాటు హింసాకాండ కొనసాగినా పోలీసులు ఎందుకు నిలువరించలేకపోయారని ఒవైసీ ప్రశ్నించారు.