Pakistan: ఆంధ్ర మత్స్యకారులను రేపు విశాఖకు విమానంలో పంపిస్తాం: మంత్రి మోపిదేవి
- ఈ రోజు ఢిల్లీలో ఏపీ భవన్లో మకాం
- రేపు విశాఖకు చేరుకోనున్న మత్స్యకారులు
- జాలర్లను కలుసుకోవడానికి అమృత్ సర్ చేరుకున్న మంత్రి మోపిదేవి
పాకిస్థాన్ చెర నుంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్యకారులను విడిపించడంలో తమ ప్రభుత్వం కీలక భూమిక పోషించిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు 14 నెలలుగా పాక్ జైళ్లలో ఉన్నారన్నారు. పొట్టకూటికోసం గుజరాత్ వెళ్లిన ఆంధ్రకు చెందిన మత్స్యకారులు అక్కడి సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లి దారి తప్పారన్నారు. పాక్ జలాల్లోకి ప్రవేశించిన 20 మంది మత్స్యకారులు అక్కడి అధికారులకు పట్టుబడ్డారన్నారు. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు జాలర్లను పాకిస్థాన్ అప్పగిస్తోందని చెప్పారు.
ఇన్నాళ్లు వారు వస్తారో రారో అన్న సందిగ్ధంలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంతో కలిసి కృషి చేశారన్నారు. ఈ మేరకు వివరాలను మోపిదేవి వివరించారు. ఈ రోజు సాయంత్రం వాఘా బోర్డర్ వద్ద మత్స్యకారులను అప్పగించే కార్యక్రమం జరుగుతోందన్నారు. రేపు వారిని ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి విమానంలో పంపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అనంతరం వారి వారి స్వస్థలాలకు పంపిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు.